అనేక ఇతర ద్రావిడ భాషల వలె కాక తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీస్తు శకం మొదటి శతాబ్దము లో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు యానాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాలనాటిది[3].
ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.
ఆంధ్రులగురించి చెప్పిన పూర్వపు ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదాహరింపబడినది: (డా.జి.వి.సుబ్రహ్మణ్యం కూర్చిన "తెలుగుతల్లి" కవితా సంకలనంలో ఇవ్వబడినది)

పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి
ఇది ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం:
అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమిచే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు.