తెలుగు, తెనుగు, ఆంధ్రము

ఈ మూడు పదాల మూలాలూ, వాని మధ్య సంబంధాలు గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. [4][5] క్రీ.పూ.700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము)లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది. కనుక ఇదే మనకు తెలిసినంతలో ప్రాచీన ప్రస్తావన. ఆ తరువాత బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది. క్రీ.పూ. 4వ శతాబ్ధిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించినాడు.
ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి. ఆంధ్ర, తెలుగు అనేవి రెండు వేర్వేరు జాతులనీ అవి క్రమంగా మిళితమైనాయన్న కొంతమంది అభిప్రాయానికి జన్యు శాస్త్ర పరంగా కానీ భాషాశాస్త్ర పరంగా కానీ గట్టి ఆధారాలు దొరకవు. వైదిక వాఙ్మయం ప్రకారం ఆంధ్రులు సాహసోపేతమైన సంచారజాతి. భాషాశాస్త్ర పరంగా తెలుగు గోదావరి, కృష్ణా నదుల మధ్య నివసిస్తున్న స్థిరనివాసుల భాష. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాజులు ముందుగా పరిపాలించడం వల్ల ఆంధ్ర, తెలుగు అన్న పదాలు సమానార్థకాలుగా మారిపోయాయని కొంతమంది ఊహాగానం. 10 వ శతాబ్దపు పారశీక చరిత్రకారుడు అల్ బిరుని తెలుగు భాషను 'ఆంధ్రీ' యని వర్ణించెను [6].
క్రీ.శ. 1000 కు ముందు శాసనాలలోగాని, వాఙ్మయంలో గాని తెలుగు అనే శబ్దం మనకు కానరాదు. 11వ శతాబ్దము ఆరంభమునుండి 'తెలుంగు భూపాలురు', 'తెల్గరమారి', 'తెలింగకులకాల', 'తెలుంగ నాడొళగణ మాధవికెఱియ' వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి. 11వ శతాబ్దములో నన్నయ భట్టారకుని కాలమునాటికి తెలుగు రూపాంతరముగా "తెనుగు" అనే పదము వచ్చినది. 13వ శతాబ్దములో మహమ్మదీయ చారిత్రికులు ఈ దేశమును "తిలింగ్" అని వ్యవహరించారు. 15వ శతాబ్దము పూర్వభాగంలో విన్నకోట పెద్దన్న తన కావ్యాలంకారచూడామణిలో ఇలా చెప్పాడు.
ధర శ్రీ పర్వత కాళే
శ్వర దాక్షారామ సంజ్ఙ వఱలు త్రిలింగా
కరమగుట నంధ్రదేశం
బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్
తత్త్రిలింగ పదము తద్భవంబగుటచేఁ
దెలుఁగు దేశ మనఁగఁ దేటపడియె
వెనకఁ దెనుఁగు దేశమును నండ్రు కొందరు
శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం - అనే మూడు శివలింగక్షేత్రాల మధ్య భాగము త్రిలింగదేశమనీ, "త్రిలింగ" పదము "తెలుగు" గా పరిణామము పొందినదనీ ఒక సమర్థన. ఇది గంభీరత కొరకు సంస్కృతీకరింపబడిన పదమేననీ, తెలుగు అనేదే ప్రాచీన రూపమనీ చరిత్రకారుల అభిప్రాయము. 12వ శతాబ్ధిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" - అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము - అని వర్ణించాడు. మొత్తానికి ఇలా తెలుగు, తెనుగు, ఆంధ్ర - అనే పదాలు భాషకూ, జాతికీ పర్యాయ పదాలుగా రూపు దిద్దుకొన్నాయి.